తిరుపతి: విభజిత ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 15 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఎన్నికలు డిసెంబర్‌లో పోస్టల్ బ్యాలెట్ విధానంలో జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీ ఫార్మా జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆరుగురు అభ్యర్థులతో కూడిన ప్యానెల్‌ను రంగంలోకి దింపింది. శనివారం తిరుపతి మునిసిపల్ ఆఫీసు ఎదురుగా రెడ్డి & రెడ్డి కాలనీలోని జేఏసీ రాయలసీమ ప్రాంతీయ కార్యాలయంలో స్టేట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ సింగనమల సుమన్ మోడీ అధ్యక్షతన మేనిఫెస్టో కరపత్రాలను అధికారికంగా విడుదల చేశారు.
ఈ ప్యానెల్‌లో రాయలసీమ ప్రాంతం తరపున తిరుపతి నుంచి డాక్టర్ ఆర్. శ్రవణ్ కుమార్ (పోస్టు బ్యాకలరేట్ ఇన్ ఫార్మసీ), కడప నుంచి ఇండస్ట్రియల్ ఫార్మసిస్ట్ గూటం జగదీష్ (ఎం.ఫార్మసీ), రిటైల్ ఫార్మసీ నిపుణుడు ఇ. పెంచల నరసింహ (ఎం.ఫార్మసీ), కర్నూలు నుంచి డాక్టర్ దేవేంద్ర నాయక్ (ఫార్మ్.డి), గుంటూరు నుంచి షేక్ హాసన్ (ఎం.ఫార్మసీ), అనకాపల్లి నుంచి సీనియర్ కమ్యూనిటీ రిటైల్ ఫార్మసిస్ట్ ఆర్. ప్రకాశరావు ఉన్నారు.
సామాజిక వర్గం, విద్యార్హత, వృత్తి అనుభవం, ప్రాంతీయ ప్రాతినిధ్యం, ఫార్మసిస్టుల సమస్యలపై లోతైన అవగాహన, పరిపాలనా దక్షతలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేశామని డాక్టర్ సుమన్ మోడీ తెలిపారు.
తమ ప్యానెల్ అభ్యర్థులు గెలిస్తే ఫార్మసీ చట్టాన్ని కచ్చితంగా అమలు చేసి, ఫార్మసిస్టుల సంక్షేమం, వృత్తి అభివృద్ధి, వృత్తి ఆధునీకరణ సాధించి ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అభ్యర్థుల పూర్తి వివరాలు, మేనిఫెస్టో కోసం www.appharmacy.news.blog వెబ్‌సైట్‌ను సందర్శించాలని, సలహాలు మరియు సందేహాలకు 9490800808 ను వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చునని చెప్పారు.

