Our Street News
విజయవాడవైద్య ఆరోగ్యం

ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు-2025: ఏపీ ఫార్మా జేఏసీ ప్యానెల్ ప్రకటించిన 6 గ్యారంటీలు

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏపీ ఫార్మా జేఏసీ (AP PHARMA JAC) ప్యానెల్ గురువారం అద్భుతమైన మేనిఫెస్టోను విడుదల చేసింది. “ఫార్మసిస్టుల సంక్షేమం – వృత్తి అభివృద్ధే మా ధ్యేయం” అనే నినాదంతో ముందుకు వస్తున్న ఈ ప్యానెల్, రాష్ట్రంలోని వేలాది మంది ఫార్మసిస్టులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ప్రకటించింది.

గత 16 ఏళ్లుగా ఎన్నికలు జరగకపోవడంతో ఏపీ ఫార్మసీ కౌన్సిల్ అవినీతి, అక్రమాలకు కేంద్రంగా మారిందని జేఏసీ నేతలు ఆరోపించారు. అనర్హులపై చర్యలు తీసుకోవాల్సిన సెక్షన్ 42ను తప్పుడుగా రిజిస్టర్డ్ ఫార్మసిస్టులపై మోపి వేలాది మంది రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్ పెండింగ్‌లో పెట్టి వృత్తి హక్కులను హరించినట్లు విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఫార్మసిస్టులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో చట్టపరిజ్ఞానం, పరిపాలన దక్షత, నిజాయితీ ఉన్న నాయకులతో కూడిన ఏపీ ఫార్మా జేఏసీ ప్యానెల్ ఆచరణ సాధ్యమైన 6 గ్యారంటీలను ప్రకటించింది.

1. సెక్షన్ 42 & 26(A) చట్టబద్ధ అమలు: ఫార్మసీ ఇన్‌స్పెక్టర్ల నియామకం, అనర్హులపై కఠిన చర్యలు (సెక్షన్ 42 + BNS 2023 క్రిమినల్ చీటింగ్ కేసులు) తీసుకుని రిజిస్టర్డ్ ఫార్మసిస్టులకు విస్తృత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ.

2. రిజిస్ట్రేషన్-రెన్యూవల్ సంస్కరణలు: 72 గంటల్లో రెన్యూవల్ పూర్తి, అఫిడవిట్ రద్దు, రూ.10కే పోస్టల్ కవర్లు, ప్రతి ఫార్మసిస్టుకు ఐడీ కార్డు, ఆధార్ లింకింగ్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఎండార్స్‌మెంట్ రద్దు, ఆలస్య రుసుము రూ.500 నుంచి రూ.250కి తగ్గింపు వంటి సంచలన సంస్కరణలు.

3. ఫార్మా.డి డాక్టర్లకు కొత్త అవకాశాలు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50 పడకలకు ఒక క్లినికల్ ఫార్మసిస్టు పోస్టు, గ్రామీణ ప్రాంతాల్లో లిమిటెడ్ ప్రిస్క్రిప్షన్ హక్కుల కోసం చర్యలు, డ్రగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్లు, ఫార్మాస్యూటికల్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు మార్గదర్శకాలు.

4. టూ-ప్లేసెస్ వర్కింగ్ సమస్య పరిష్కారం: మొదటి ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లోనే అన్ని పెండింగ్ కేసులకు ఒకేసారి రెన్యూవల్, ఒక్క రూపాయి పెనాల్టీ లేకుండా మొదటి తప్పును క్షమించి పూర్వ ఆరోపణలన్నీ రద్దు చేస్తామని గ్యారంటీ.

5. ఫార్మసిస్టుల భద్రత-సంక్షేమం: ఆకస్మిక మరణం సందర్భానికి కుటుంబానికి రూ.10 లక్షల బీమా సహాయం, కౌన్సిల్‌లో ఫీడ్‌బ్యాక్ ఫారం, లాక్డ్ కంప్లయింట్ బాక్స్, ఆన్‌లైన్ గ్రీవెన్స్ సిస్టమ్.

6. సబ్సిడీ రుణాలు-కనీస వేతనం: సొంత మెడికల్ షాపు కోసం రూ.8 లక్షల వరకు సబ్సిడీ బ్యాంక్ రుణాలు (కౌన్సిల్ స్యూరిటీ), ప్రైవేటు మెడికల్ షాపుల్లో పనిచేసే ఫార్మసిస్టులకు కనీస వేతనం రూ.15,000, అనుభవం ఆధారంగా స్పష్టమైన వేతన నియమాలు.

ఫార్మసిస్టుల వృత్తి గౌరవం పునరుద్ధరణ, ప్రాక్టీస్ హక్కుల రక్షణ, కౌన్సిల్‌ను పారదర్శకంగా నడపడమే మా అంతిమ లక్ష్యం” అని ఏపీ ఫార్మా జేఏసీ ప్యానెల్ పిలుపునిచ్చింది. అఖండ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫార్మసిస్టులను కోరింది.

Related posts

ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలకు జేఏసీ సంసిద్ధం

SKG

ఏపీ ఫార్మసిక్ కౌన్సిల్ ఎన్నికలు – భారీ కుట్ర

SKG

“లా నేస్తం” నెలకు ₹10,000 ఎక్కడ ?

SKG

Leave a Comment

హోమ్
ఉద్యోగాలు
జాతీయ వార్తలు
పబ్లిష్ పోస్ట్