తిరుపతి జిల్లా: ఈనెల 6 వ తేదీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయ్ గారు సుప్రీం కోర్టు నందు తమ రాజ్యాంగపరమైన విధులను నిర్వర్తిస్తున్న సమయంలో ఒక న్యాయవాది తన కాలి బూటును న్యాయమూర్తి పై విసురుతూ చేసిన అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తూ వెంకటగిరి న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు గౌరవం, స్వతంత్రత, నిష్పాక్షికత పరిరక్షణలో భారత న్యాయవ్యవస్థతో ఐక్యంగా నిలుస్తున్నట్లు వెల్లడించిన వెంకటగిరి న్యాయవాదులు, నిరసనగా ఈరోజు తమ కోర్టు పనులకు బహిష్కరిస్తూ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. అలాగే, న్యాయవాదుల గౌరవం, భద్రతా, రక్షణ కోసం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ చట్టంను తక్షణం అమలు చేయాలని, అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టులు, దిగువ కోర్టుల న్యాయమూర్తులకు ప్రత్యేక భద్రతా బలగం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంకటగిరి బార అసోసియేషన్ కార్యవర్గము ప్రధాన కార్యదర్శి, వెంకటగిరి ప్రముఖ న్యాయవాది పెట్లూరి రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

