అమరావతి: గత వైసిపి ప్రభుత్వ హయాంలో “లా నేస్తం” అనే పథకాన్ని 2019 డిసెంబర్‌లో ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ పథకం కింద న్యాయవాద వృత్తిలోకి కొత్తగా ప్రవేశించిన యువ న్యాయవాదులకు (జూనియర్ లాయర్లకు) ఆర్థిక సహాయం అందించడానికి రూపొందించబడింది. వైసిపి 2019 లో తన ఎన్నికల మేనిఫెస్టోలో దీనిని ఒక హామీగా చేర్చారు. ఈ పథకం యువ న్యాయవాదుల వృత్తిగత జీవితంలో మొదటి మూడేళ్లలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తగ్గించి, వారిని ప్రోత్సహించడం లక్ష్యంగా తీసుకురాగా, 4,248 మంది న్యాయవాదులకు రూ. 35.40 కోట్ల రూపాయలు జూనియర్ న్యాయవాదులకు అందించబడ్డాయి. అయితే ఇదే పథకం కొనసాగింపుగా తాము అధికారంలోకి వస్తే జూనియర్ న్యాయవాదులకు నెలకు ₹10,000/- అందిస్తామని కూటమి పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు తమ మేనిఫెస్టోలో చేర్చి ప్రకటించడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఒకటిన్నర సంవత్సరం గడుస్తున్నప్పటికీ లా నేస్తం పథకాన్ని అమలు చేసిన దాఖలాలు లేవు. ఫలితంగా కొంతమంది జూనియర్ న్యాయవాదులు లా నేస్తం పథకానికి అర్హత కోల్పోతూ ఉండగా, మిగిలినవారు లా నేస్తం లబ్ధి చేకూరక యధావిధిగా అనేక ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారని కడప జిల్లాకు చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది కర్నాటి భువన ఏకాదశి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఈ పథకాన్ని అమలు చేసి ఉంటే ఒక్కొక్క జూనియర్ న్యాయవాది దాదాపు ₹1,60,000/– లబ్ధి పొందేవారు. ఏది ఏమైనా లా నేస్తం పథకాన్ని కొనసాగిస్తూ వీలైనంత తొందరగా ప్రతి జూనియర్ న్యాయవాదికి ఈ పథకాన్ని వర్తింపజేసే ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు.
previous post
next post

