నెల్లూరు: రాపూరు మండల పరిధిలోని నవాబుపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి పర్వదినం జరుపుకోవాల్సి ఉండగా అశ్లీల నృత్యాల నడుమ మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకులు గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. వాస్తవ విషయాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రం నుంచి హిజ్రాలను గ్రామంలోకి తీసుకొచ్చి గ్రామంలో డిజె సౌండ్ పెట్టీ మద్యం మత్తులో చిందులేస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. ఈ అశ్లీల నృత్యాలు తెల్లవారుజామున మూడు గంటల వరకు కొనసాగించారు, విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వచ్చి అశ్లీల నృత్యాలను అడ్డుకొని, నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎంత కట్టుదిట్టం చేసినప్పటికీ కొంతమంది యువకులు మత్తులో ఇటువంటి నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నారు. ఇందులో కొంత మంది చదువుకున్న యువకులతో పాటు ఒక యువ న్యాయవాది ఉండటం సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం. జరిగిన సంఘటనను వక్రీకరించి “న్యాయవాదిపై పోలీసు దాడి” అంటూ వెంకటగిరి బార్ అసోసియేషన్ సభ్యులను సైతం తప్పుదోవ పట్టించి వెంకటగిరి కోర్టు విధులను న్యాయవాదులు బహిష్కరించేలా చేశారని తెలుస్తోంది. చట్టం పట్ల పూర్తి అవగాహన ఉండి కూడా ఇటువంటి చర్యలకు పాల్పడటం ఏంటని గ్రామ ప్రజలు, మహిళలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏది ఏమైనా రాపూరు ఘటనకు సంబంధించి పోలీసులు నిర్వాహకులను పట్టుకుని కేసులు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు.
previous post

